: తమిళనాట మరోరెండు పథకాలు... విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్
తమిళనాట మరో రెండు ప్రభుత్వ పథకాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు వివిధ హామీలు ప్రకటించిన ముఖ్యమంత్రి జయలలిత, ఇప్పుడా హామీలు నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా రెండు పథకాలను ప్రారంభించారు. 2016-17 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రారంభిస్తూ, సెక్రటేరియట్ లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్ కార్డు బస్ పాస్ లను స్వయంగా ముఖ్యమంత్రి అందజేశారు. ఈ పథకం ద్వారా సుమారు 28.05 లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. 504.31 కోట్ల రూపాయలతో సుమారు 31.11 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అందజేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే, జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కేనగర్ నుంచి పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కేనగర్ కు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సచివాలయంలో జయలలిత పెన్షన్ అందజేశారు. ఈ పథకం ద్వారా ఆగస్టు నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున 1,248 మందికి పెన్షన్ అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.