: కశ్మీర్ అల్లర్లపై రాజ్యసభలో విమర్శల తూటాలు పేల్చిన గులాం నబీ ఆజాద్
అల్లర్లతో అట్టుడుకుతోన్న కశ్మీర్ అంశంపై రాజ్యసభలో ఈరోజు వాడీవేడీగా మాటల తూటాలు పేలాయి. ఆ రాష్ట్ర ప్రజలకు పీడీపీ-బీజేపీ ప్రభుత్వంపై విశ్వాసం లేదని, ప్రభుత్వ తీరే అందుకు కారణమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అక్కడి పౌరులనూ మిలిటెంట్లలా చూస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చూస్తూ వారిని అణచివేసే ప్రయత్నాలు చేయొద్దని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా జవాన్లు వారిపై తూటాలతో విరుచుకుపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంపై తాను ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిలిటెన్సీని అంతమొందించడంలో తమ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని, అయితే, పౌరుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుకి మాత్రం తమ మద్దతు ఉండబోదని ఆయన చెప్పారు.