: రాజకీయ నేతలు క్రికెట్ కు దూరంగా వుండాలి... 70 ఏళ్లు దాటిన వారికి బీసీసీఐలో చోటు లేదు!: సుప్రీం ఆదేశాలు
భారత క్రికెట్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. క్రికెట్ లో సమూల మార్పులను సూచిస్తూ జస్టిస్ ఆర్ ఎం లోధా కమిటీ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. జస్టిస్ లోధా కమిటీ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని, ఆరు నెలల్లోగా భారత క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, క్రికెట్ కు రాజకీయ నేతలు దూరంగా ఉండాలని చీఫ్ జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లోధా కమిటీ సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ క్రికెట్ అసోసియేషన్లు కలిగిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిలో ఓటింగ్ లో పాల్గొంటాయి. మంత్రి పదవిలో ఉన్నవారు బీసీసీఐ సభ్యులుగా ఉండటానికి వీల్లేదు. కాగా, ఈ ఆదేశాలపై స్పందించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తిరస్కరించారు. అయితే, ఈ తీర్పుపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆమోదించిన ముఖ్య సిఫార్సులు... ఇకపై బీసీసీఐలో ఒక రాష్ట్రం, ఒక ఓటు విధానం కొనసాగాలని, మంత్రి పదవిలో ఉన్నవారు, 70 ఏళ్ల వయసు దాటిన వారు బీసీసీఐలో సభ్యులుగా ఉండటానికి వీల్లేదని, 6 నెలల్లోగా జస్టిస్ లోధా సిఫార్సులను బీసీసీఐ అమలు చేయాలని, తీర్పును కచ్చితంగా అమలు చేయాలని, దీంతో బీసీసీఐలో సంస్కరణలు సాధ్యమవుతాయని, ఇకపై కాగ్ ప్రతినిధి ఒకరు బీసీసీఐ లో సభ్యుడిగా ఉంటారని తెలిపింది. కాగా, ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ వస్తుందా? లేదా? అనే అంశాన్ని, దేశంలో బెట్టింగ్ చట్టబద్ధం చేసే అంశాన్ని పార్లమెంట్ కు వదిలివేస్తున్నామనే సిఫార్సులను ధర్మాసనం ఆమోదించింది.