: నవంబర్ 18న పెళ్లి చేసుకుంటా... అయితే, సంవత్సరం మాత్రం చెప్పలేను!: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తాను నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. అయితే తాను పెళ్లిచేసుకునేది ఏ సంవత్సరమో మాత్రం చెప్పలేదు. ముంబయిలో జరిగిన భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌కు, సానియా మీర్జాకి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. కార్యక్రమానికి వచ్చిన అభిమానుల ముందు సల్మాన్ ఖాన్‌ని సానియా 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగింది. 'సల్మాన్ పెళ్లి అంశం అభిమానులకు ఎంతో ముఖ్యం' అని పేర్కొంది. దీంతో సల్మాన్ ఖాన్ కాసేపు ఆలోచించుకొని 'నవంబర్ 18' అని తెలిపాడు. నవంబర్ 18 రోజునే తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా పెళ్లి చేసుకున్నారని, అదే తేదీలో తాను కూడా పెళ్లి చేసుకుంటానని సల్మాన్ అన్నాడు. అయితే తన పెళ్లి ఏ సంవత్సరంలోనో చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించాడు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని మిమ్మల్ని మహిళలెవరు ప్రశ్నించలేదా..? అని సానియా మళ్లీ అడిగింది. దీనికి సల్మాన్ జవాబిస్తూ, ఈ ప్రశ్న కొందరు అడుగుతారని బదులిచ్చాడు. అలాగే ఈ విషయంలో వారు ఎంతో ఒత్తిడి చేస్తారని అన్నాడు. వారు ఎవరని సానియా ప్రశ్నించగా, సల్మాన్ తన అమ్మ, చెల్లెళ్లు అని సమాధానం చెప్పి, అందర్నీ నవ్వించాడు.