: ఇంటర్ విద్యార్థుల కోసం 'సూపర్ 30' ప్రత్యేక క్లాసులు
ప్రతియేటా కేవలం 30 మంది పేద విద్యార్థులను ఎంచుకుని వారు ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) పాస్ అయ్యేలా చూస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'సూపర్ 30' ఇకపై టెన్త్ పాస్ అయి ఇంటర్ చేరే విద్యార్థుల కోసం రెండేళ్ల క్లాసులను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ వెల్లడించారు. "కొత్తగా రెండేళ్ల ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నాం. 10 నుంచి 20 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేసి, వారి రెగ్యులర్ క్లాసులు పూర్తయిన తరువాత కోచింగ్ ఇస్తాము. ఈ సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమవుతాయి. మామూలుగా ఉండే 30 మంది విద్యార్థులకు ఈ విద్యార్థులు అదనం" అని తెలిపారు. కాగా, ఈ సంవత్సరం 30 మంది విద్యార్థుల్లో 28 మంది జేఈఈ పాస్ కావడంతో 'సూపర్ 30' పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ఎంతో మంది విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు డొనేషన్లు ఇస్తామని ముందుకు వచ్చినా, సహకరిస్తామని కేంద్రం తెలిపినా ఆనంద్ నిరాకరించారు. తన మార్గంలోనే తాను వెళతానని, పేద విద్యార్థులకు సాయం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేయడం గమనార్హం.