: రాహుల్ గాంధీ మాస్టర్ స్ట్రోక్ కు బీజేపీ దింపుడు కళ్లెం ఆశలు కూడా ఆవిరి!
ఈశాన్యాన అరుణాచల్ ప్రదేశ్ లో పాలనా పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ ఆశ అడుగంటి పోయింది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెబల్ ఎమ్మెల్యేల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ చేసిన ఆఖరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి నబమ్ తుకీ చేత రాజీనామా చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఎత్తునకు బీజేపీ చిత్తయింది. ఆయన్ను తొలగిస్తే, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోనే ఉంటారని పసిగట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తనదైన శైలిలో పావులు కదిపారు. ఆయన స్వయంగా ఈటానగర్ కు రాకున్నా, ఢిల్లీ నుంచే రెబల్స్ తో మంతనాలు సాగించారు. టుకీని తొలగించి, వేరే నేతను సీఎంగా ఎన్నుకుంటే, తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని వారు వెల్లడించడంతో, ఆ వెంటనే టుకీని రాజీనామా చేయాలని రాహుల్ స్వయంగా కోరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం టుకీ రాజీనామా చేయగా, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ పేరు తెరపైకి వచ్చింది. సీఎంను మార్చడం ద్వారా అసమ్మతిని దారికి తెచ్చిన కాంగ్రెస్ హైకమాండ్, పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ కోరికకూ చెక్ పెట్టింది. 45 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ ఖండూ గవర్నర్ ను కలిశారు. ఇక నేడో రేపో ఖండూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.