: బీర్ పీకుతూ సెల్ఫీ దిగిన జడేజా, రోహిత్... సీరియస్ అయిన బీసీసీఐ
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మ్యాచ్ ల మధ్య విశ్రాంతి పేరిట చేస్తున్న పనులు శ్రుతిమించాయి. ఆటగాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న చిత్రాలు వారిని విమర్శలకు గురి చేస్తున్నాయి. సముద్ర విహారం చేస్తూ, బీరు సీసాతో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టారు. కేఎల్ రాహుల్ తన చేతిలో బీరు బాటిల్ పట్టుకుని ఉండగా, పక్కనే బిన్నీ, ఉమేశ్ యాదవ్ లు కనిపిస్తున్న మరో ఫోటో హల్ చల్ చేసింది. ఇక ఆటగాళ్ల వేషాలపై బీసీసీఐ గట్టిగా స్పందించింది. స్టార్ క్రికెటర్లను అనుసరించే కోట్లాది మంది భారత యువతను దృష్టిలో పెట్టుకుని మెలగాలని టీమ్ మేనేజర్ రియాజ్ బగ్వాన్ కు బోర్డు పెద్దలు సూచించారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే ముందు బాధ్యతగా ఉండాలని క్లాస్ పీకారు. విజ్ఞతతో మెలగాలని బీసీసీఐ పెద్దలు కోరారు. ఆపై బీరు పీకుతూ పెట్టిన ఫోటోలను ఆటగాళ్లు తీసేసినప్పటికీ, అప్పటికే వైరల్ అయిన ఈ చిత్రాలు నెట్టింట ఇంకా తిరుగుతున్నాయి.