: అలకనంద ఉగ్రరూపం... గంగోత్రి దేవాలయం మునక
ఉత్తరాఖండ్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంగానది ఉపనదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రధానంగా అలకనందా నది భారీ వరదతో పోటెత్తింది. శ్రీనగర్ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల అలకనందా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని అధికారులు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లోకి నీరు చేరగా, భక్తులు ఎగువ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చార్ ధామ్ లోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గంగోత్రి దేవాలయం నీట మునిగింది. భారీ వర్షాల వల్ల హల్ద్వానీ సహా అనేక పట్టణాలు నీట మునిగాయి. కట్టుబట్టలతో ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తాగు నీటికి, ఆహారానికి తీవ్ర అవస్థలు పడుతుండగా, ప్రభుత్వం చేస్తున్న సాయం చాలడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, ఉత్తర కాశీ జిల్లాలోని గోముఖ్ రహదారిని ముందుజాగ్రత్తగా అధికారులు మూసివేశారు. చిర్ వాసా, దియోగడ్ వద్ద వరద ఉద్ధృతికి రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. చమోలీలో కొండ చరియలు విరిగిపడి 22 చోట్ల రహదారులు మూసుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.