: సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యం!...అంతర్రాష్ట్ర మండలి ఉద్దేశాన్ని చెప్పిన నరేంద్ర మోదీ!
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం ప్రధాన ఉద్దేశంతోనే తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాని... కేంద్రం, రాష్ట్రాల మధ్య సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మండలి సమావేశం జరుగుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్రాలకు ఇతోధికంగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్ర పన్నుల వాటాను పెంచామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అంతా ఇక్కడ సమావేశం కావడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. అరుదుగా వచ్చే ఇలాంటి సదవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.