: ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై వెనక్కి తగ్గిన చైనా.. సహకరిస్తామన్న డ్రాగన్ కంట్రీ
అణు సరఫరాదారుల బృందం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్- ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్న చైనా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని చైనా కావాలనే అడ్డుకుంటోందనే ఆరోపణల నేపథ్యంలో కాస్త మెత్తబడినట్టు అనిపిస్తోంది. ఈ విషయంలో చర్చలకు చైనా సిద్ధంగా ఉందని భారత్ లో చైనా రాయబారి లీయు జింగ్ సాంగ్ పేర్కొన్నారు. చైనా పేరు ప్రస్తావించకుండానే ఎన్ఎస్జీలో తమ సభ్యత్వాన్ని తీవ్రంగా అడ్డుకునేందుకు ఓ దేశం ప్రయత్నిస్తోందని గత నెలలో భారత్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘ఆ దేశం చైనానే అని ఎందుకు అనుకుంటారు?’ అని లీ ఓ ఇంటర్వ్యూలో ఎదురు ప్రశ్నించారు. 'గత నెల వరకు ఈ వ్యవహారం చాలా వేడిగా ఉండేది. ఇప్పుడు చల్లబడింది. మళ్లీ దానిని రాజేయాలని అనుకోవడం లేద'ని ఆయన పేర్కొన్నారు. దౌత్యవేత్తలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. భారత్ సభ్యత్వం విషయంలో చైనా పాత్ర మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ మూడు.. నియమాలకు కట్టుబడి ఉండడం, చర్చలు, పరిష్కార మార్గం అని పేర్కొన్నారు. క్షిపణి నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో భారత్ సభ్యత్వాన్ని ఆహ్వానించిన లీ.. ఎంటీసీఆర్ లో చైనా సభ్యత్వం, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం మధ్య క్విడ్ ప్రో కో జరిగే అవకాశం ఉందన్న విమర్శలను కొట్టిపడేశారు. అలాగే దక్షిణ చైనా సముద్ర వివాదంపైనా లీ స్పందించారు. ఆ మార్గంలో వాణిజ్యాన్ని అడ్డుకునే ఉద్దేశం తమకు లేదన్నారు. తమది కూడా భారత్ లాగే శాంతి కాముక దేశమని పేర్కొన్నారు.