: పదేళ్ల తర్వాత 11వ అంతర్రాష్ట్ర మండలి భేటీ!... ఢిల్లీ బాటలో అన్ని రాష్ట్రాల సీఎంలు!
కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకొనేందుకే అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. ఇంతటి కీలక ప్రాధాన్యమున్న ఈ మండలి ఇటీవలి కాలంలో భేటీ అయిన దాఖలానే లేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఈ మండలి సమావేశాలపై అసలు దృష్టే సారించలేదు. పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన యూపీఏ ఒకే ఒక్కసారి ఈ మండలిని సమావేశపరచింది. ఇక యూపీఏను గద్దె దించి ప్రధాని పీఠమెక్కిన నరేంద్ర మోదీ కూడా తొలి రెండేళ్ల పాలనలో ఈ మండలి సమావేశంపై దృష్టి సారించలేకపోయారు. తాజాగా నేడు ఈ మండలి సమావేశానికి కేంద్రం ఏర్పాట్లు చేసింది. వెరసి దాదాపు పదేళ్ల తర్వాత ఈ మండలికి సంబంధించి 11వ భేటీకి కార్యరంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. నేడు జరగనున్న ఈ మండలి భేటీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్ననే ఢిల్లీ చేరారు. మరిన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఢిల్లీలో కాలుమోపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలు రాష్ట్రాల సీఎంలు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఆధార్ కార్డుల వినియోగం, అంతర్గత భద్రత... తదితర ముఖ్య విషయాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.