: ఇంకానా.. ఐఎస్ పై యుద్ధం ప్రకటించాల్సిందే!: డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్
ఉగ్రదాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ లోని నీస్ ఘటనపై తీవ్రంగా స్పందించిన వారు ఇద్దరూ ఒకేరకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘మనమో ప్రత్యేక ప్రపంచంలో నివసిస్తున్నట్టు ఉంది. ఇక్కడ శాంతిభద్రతలపై నమ్మకం లేదు. దేనిమీదా ఎవరికీ గౌరవం ఉండడం లేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చూస్తుంటే ఇది ప్రపంచ యుద్ధంలానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. "పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, శాన్ బెర్నార్డినో, పారిస్, ఓర్లాండ్ ఘటనలను మనం చూశాం. బలమైన, స్మార్ట్ లీడర్ షిప్ లేకుండా పరిస్థితి మరింత దిగజారుతుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. తానే కనుక అమెరికా అధ్యక్షుడినైతే ఐఎస్ పై యుద్ధానికి వెనుకాడనన్నారు. ‘‘ఇదో విభిన్న యుద్ధం. ఈ విషయంలో మనం సులభంగా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఇస్లాంను వాడుకుంటున్న జిహాదీలు, ఉగ్రవాదులతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ఉగ్రవాద గ్రూపులు, రాడికల్ జిహాదిస్ట్ గ్రూపులపై యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ప్రజలు దీనిని వరల్డ్ వార్-3గా అభివర్ణిస్తున్నారని ఆమె అన్నారు. ఐఎస్ ఉగ్రవాదులను ఇక్కడి నుంచి వెళ్లగొడితే మరో ప్రాంతం నుంచి దాడులు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అని హిల్లరీ పేర్కొన్నారు.