: అరుణాచల్ ప్రదేశ్‌లో రేపటి బలనిరూపణ పరీక్ష నిర్వహణపై సందిగ్ధత
అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి ఎదరుదెబ్బ తగిలి, ఆ రాష్ట్రంలో గతేడాది డిసెంబర్‌కు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే రేపు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బలనిరూపణకు ఆ రాష్ట్ర గవర్నర్ తథాగతరాయ్ ఆదేశించారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ తిరుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్ అన్నారు. బల నిరూపణలో తమదే విజయమని మరోపక్క సీఎం నబం తుకీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇంతలోనే రేపటి బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది. బలపరీక్షకు సిద్ధమవడానికి తమకు 10 రోజుల సమయం కావాలని నబం తుకీ అన్నారు. బలపరీక్షను వాయిదా వేయాలని కోరారు. నబం తుకీ చేసిన విన్నపాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చారు. మరోవైపు తనకు గవర్నర్ నుంచి ఈ అంశంపై ఎటువంటి ఆదేశాలు అందలేదని అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ నబం రేబియా పేర్కొన్నారు. విశ్వాస పరీక్ష పెడుతున్నామనే విషయాన్ని ఎమ్మెల్యేలందరికీ తెలియజేయాలని, దీని కోసం కనీసం 15 రోజుల సమయం కావాలని స్పీకర్ అన్నారు. ఈ అంశంపై గవర్నర్ మరోసారి ఆలోచిస్తారని, అడ్వొకేట్ జనరల్, ఇతర న్యాయనిపుణుల సలహా తీసుకుని తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారేమోనని స్పీకర్ నబం రేబియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.