: నన్ను చూస్తే అందరికీ హైదరాబాదే గుర్తుకొస్తుంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటుందని ప్రపంచానికి తెలియపర్చాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను చూస్తే అందరికీ హైదరాబాదే గుర్తొస్తుంది’ అని అన్నారు. అమరావతిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం అని చెప్పారు. చైనా, దావోస్, జపాన్, రష్యా ఎక్కడికి వెళ్లినా తన ధ్యాసంతా అమరావతిపైనే ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల తన రష్యా పర్యటనలో సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ మెరైన్ టెక్నికల్ వర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పోలిస్తే రష్యాలో వనరులు ఎక్కువ అని చంద్రబాబు చెప్పారు. పౌరవిమానయానం, ఆయిల్, పెట్రోల్‌తో పాటు ఇతర రంగాల్లో మనకు రష్యా అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. మన దగ్గర నుంచి రష్యాకు ఐటీ, ఫార్మా ఉత్పత్తులు వారికి అవసరమని చంద్రబాబు అన్నారు. రష్యన్ పరిశ్రమలకు క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతిని అత్యద్భుతంగా నిర్మిస్తామని ఆయన మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రం పరిశ్రమల కేంద్రం కావాలని ఆయన అన్నారు.