: విజయవాడ పసికందు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులపై పరువు నష్టం దావా వేస్తా నంటున్న మరో మహిళ!
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మాయమైన బిడ్డ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. 'మాయమైన బేబీతో మహిళ' అంటూ విజయవాడ పోలీసులు ఓ ఫోటోను పోస్టర్లుగా వేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అతికించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముద్రించిన పోస్టర్లలో మహిళ ఓ టీవీ ఛానెల్ ను ఆశ్రయించారు. పోలీసులు విడుదల చేసిన పోస్టర్లలో తన ఫోటో ముద్రించారని, తాను నిందితురాలిని కాదని చెప్పారు. తన బిడ్డ ఐదు నెలల బిడ్డ అని, ఫిబ్రవరి 24న గుంటూరులో హెల్ప్ ఆసుపత్రిలో జన్మనిచ్చానని ఆమె చెప్పారు. ఈ బిడ్డ తనదేనని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలకైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పోస్టర్లు విడుదల చేసిన పోలీసులపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా సిద్ధమని ఆమె ఆవేశంగా అంది.