: బంగ్లాదేశ్ నుంచి మాయమైన 100 మంది... ఢాకా దాడుల మాస్టర్ మైండ్ ఇండియాలోనే!
గత నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రదాడికి తెగబడిన ముఠా వెనకున్న మాస్టర్ మైండ్ ఇండియాలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నట్టు ప్రధాని హసీనా విదేశాంగ సలహాదారు గవహర్ రిజ్వీ వ్యాఖ్యానించారు. అతను పశ్చిమ బెంగాల్ లోని ఓ గుర్తు తెలియని ప్రాంతంలో దాక్కుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తమ దేశం నుంచి 100 మందికి పైగా యువత ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై దేశం వదిలి వీడినట్టు తెలుస్తోందని, వీరందరి వివరాలనూ ఇండియా విచారణా సంస్థలతో పంచుకుంటామని తెలిపారు. పది రోజుల క్రితం బురుద్వాన్ లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన ఐఎస్ ఉగ్రవాది అబూ అల్ ముసా అల్ బంగాలీ అలియాస్ ముసా నుంచి సేకరించిన సమాచారాన్ని తామూ తెలుసుకుంటామని, జేఎంబీ ఉగ్రవాది మహ్మద్ సులేమాన్ ఆచూకీ కోసం సహకరించాలని భారత్ ను కోరతామని అన్నారు. దేశం నుంచి మాయమైన యువత వివరాలకో కూడిన రిపోర్టును తయారు చేస్తున్నామని, విద్యాధిక సమాజానికి చెందిన యువత పెడదారి పట్టడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నారు.