: 'బాస్టిల్ డే' కథా కమామీషు ఇది!
ఈ ఉదయం నిద్రలేవగానే ప్రపంచానికి తెలిసిన దుర్వార్త... ఫ్రాన్స్ 'బాస్టిల్ డే' వేడుకల్లో జరిగిన మారణహోమం గురించి. వైభవంగా వేడుకలు జరుగుతున్న వేళ, ఓ ట్రక్కులో దూసుకొచ్చిన ముష్కరుడు దయారహితంగా అమాయక ప్రజల పైకి ట్రక్కును ఎక్కించి 85 మందిని బలితీసుకుని, సుమారు 100 మందిని తీవ్రగాయాలపాలు చేశాడు. ఈ నేపథ్యంలో అసలు 'బాస్టిల్ డే' వెనకున్న విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే... 'బాస్టిల్ డే'... ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం. ఆంగ్లం మాట్లాడే దేశాలు ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవానికి పెట్టిన పేరే 'బాస్టిల్ డే'. ఇది ప్రతి సంవత్సరం జూలై 14న జరుగుతుంది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలంటే, 1789కి వెళ్లాలి. స్వాతంత్ర్యం కోసం ఫ్రాన్స్ దేశీయులు తీవ్రంగా ఉద్యమిస్తున్న వేళ, జూలై 12న బాస్టిల్ నగరంపైకి దండెత్తిన ప్రజలు రెండు రోజుల పోరాటం అనంతరం సైన్యాన్ని తరిమికొట్టారు. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ 'బాస్టిల్ డే'ను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా సంప్రదాయ మిలటరీ పరేడ్ అధ్యక్ష భవనం ముందు సాగుతుంది. దీనికి వివిధ దేశాల నుంచి అతిథులు కూడా వస్తారు. ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ -16 కి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనల ఉద్యమం 'బాస్టిల్ డే'తో ముగిసింది. అంతకుముందు ఫ్రాన్సులో థర్డ్ ఎస్టేట్ (సాధారణ ప్రజల సమూహం) తనంతట తానుగా జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నది. దీన్ని చక్రవర్తి తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజలపైకి సైన్యాన్ని పురికొల్పాడు. ఈ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు వదిలారు. రాచరికాన్ని రూపుమాపాలన్న బలమైన కోరిక ప్రజలను పెను ఉద్యమం వైపు మళ్లించింది. థర్డ్ ఎస్టేట్ మద్దతుదారుగా ఉన్న ఆర్థిక మంత్రి జాక్వెస్ నిక్కర్ జూలై 11న హత్యచేయబడటం, ప్రజలను బాస్టిల్ వైపు దండయాత్రకు నడిపించింది. ఆనాడు పొందిన స్వాతంత్ర్యం స్ఫూర్తి రెండు శతాబ్దాల్లో ఫ్రాన్స్ ను అగ్రదేశాల్లో ఒకటిగా నిలిపింది. ఆ ఘటనలను గుర్తు చేసుకుంటూ, అభివృద్ధికి పునరంకితం కావడమే లక్ష్యంగా ఫ్రాన్స్ దేశీయులు 'బాస్టిల్ డే'ను జరుపుకుంటారు.