: ఇంటర్నెట్ ను రాక్ చేస్తున్న 'పోకేమాన్ గో'... దాని జోలికే పోవద్దంటున్న నిపుణులు!
పోకేమాన్ గో... ఇటీవలి కాలంలో మొబైల్ గేమ్ గా, స్మార్ట్ ఫోన్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఆట. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే... రికార్డు వ్యవధిలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్లలోకి చేరిపోయింది. దీన్ని ఆడుతూ మురికి గుంటల్లో పడ్డవారి నుంచి ప్రమాదాలకు గురైన వారి వరకూ ఉన్నారు. రియల్ టైం జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ ఆటలో మన చుట్టు పక్కల వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ సాయంతో ఆటగాడు ఎక్కడ ఉంటే, అక్కడి నుంచే ఆట మొదలవుతుంది. జపాన్ లోని నింటెండో తయారు చేసిన ఈ గేమ్ లో, ఆటగాడికి దూరంగా వెళుతుండే, వర్చ్యువల్ కార్టూన్ క్యారెక్టర్లను పట్టుకోవాలి. ఉదాహరణకు మీ ఇంటి ముందు నిలబడి గేమ్ స్టార్ట్ చేస్తే, మీ పక్క వీధిలో ఓ పోకేమాన్ కనిపిస్తుంది. దాన్ని పట్టుకోవాలంటే, మీరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ వీధిలోకి వెళ్లాలి. అది దొరకగానే మరికాస్త దూరంలో ఇంకోటి కనిపిస్తుంది. ఈ గేమ్ ఆడటం వల్ల శరీరానికి వ్యాయామం కూడా లభిస్తోందని కొందరు అంటుండగా, గేమ్ పై మనసు పెట్టి రోడ్లపైకి వచ్చి, అటూ ఇటూ చూడకుండా నిమగ్నమై ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని అత్యధికులు విమర్శిస్తున్నారు. గేమ్ అమెరికాలో విడుదలైన వారం రోజుల వ్యవధిలో 6.5 కోట్ల స్మార్ట్ ఫోన్లలోకి చేరింది. ఇండియాలో నేడో రేపో విడుదల కానుంది. ఇక ఈ గేమ్ కు బానిసలుగా మారడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో పాప్యులర్ అయిన గేమ్ పై ఇప్పటికే హాకర్లు కన్నేశారని, వారి చేతుల్లోకి గేమ్ వెళితే, కోట్లాది స్మార్ట్ ఫోన్ల సమాచారం చేరుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆట ఆడేవాళ్లు, తమ గూగుల్ ఖాతాల సమగ్ర సమాచారాన్ని గేమ్ డెవలపర్లకు అందించాల్సి వస్తుందని గుర్తు చేస్తూ, ముఖ్యమైన మెయిల్స్, రహస్యంగా ఉంచాల్సిన సమాచారం సులువుగా థర్డ్ పార్టీ చేతికి అందిపోతుందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఆట ఆడేవాళ్లు పోకేమాన్ లను పట్టుకునేందుకు వీధుల్లో వెళుతూ, గేమ్ లో తలదూర్చి, ప్రమాదాల బారిన పడే అవకాశాలు అధికమని హెచ్చరిస్తున్నారు.