: షీలా దీక్షిత్ ఒప్పుకోవడం వెనుక ప్రియాంకా గాంధీ మంత్రాగం!
దేశంలోనే కీలక రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెను కసరత్తే చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ గా వ్యవహరిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి పునర్వైభవం సాధించాల్సిందేనని ఆ పార్టీ పెద్దలంతా భావించారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా వరుసగా మూడు పర్యాయాలు... ఏకంగా 15 ఏళ్ల పాటు పాలించిన పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దించాలని ఆ పార్టీ పథకం రచించింది. అయితే ఇందుకు షీలా దీక్షిత్ తొలుత ఒప్పుకోలేదు. పార్టీ అధిష్ఠానం రెండు సార్లు ప్రతిపాదించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. యూపీ కోడలిగా షీలా రంగంలోకి దిగితేనే ఎన్నికల్లో కాస్తంత మంచి ఫలితాలు వస్తాయన్నది కాంగ్రెస్ భావన. అయితే అందుకు షీలా ససేమిరా అంటుండటంతో పార్టీ అధిష్ఠానం చివరకు ప్రియాంకా గాంధీ వాద్రాను రంగంలోకి దించింది. యూపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్న షీలాను ఒప్పించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రియాంకా... పార్టీ సీనియర్లు గులాం నబీ ఆజాద్, రాజీశ్ శుక్లాలను వెంటబెట్టుకుని రంగంలోకి దిగారు. షీలా దీక్షిత్ తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఏకంగా ప్రియాంకా గాంధీయే వచ్చి బాధ్యతలు తీసుకోమని కోరడంతో షీలా దిగిరాక తప్పలేదు. చర్చలు ఫలించి షీలా ఓకే చెప్పడంతో వెనువెంటనే ఆమె పేరును యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.