: సౌత్ సూడాన్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 156 మంది భారతీయులు.. తిరువనంతపురంలో ల్యాండైన విమానం
దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17 విమానం కొద్దిసేపటి క్రితం తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మాతృదేశంలో క్షేమంగా అడుగుపెట్టిన వారి ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. కాగా ప్రభుత్వం రక్షించి తీసుకొచ్చిన వారిలో 46 మంది కేరళీయులు కాగా ఇద్దరు నేపాల్ దేశస్థులు, ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మిగతా వారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు. అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సూడాన్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించి తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ను ప్రారంభించింది. సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా రెండు విమానాల్లో రెస్క్యూ సిబ్బందితో కలిసి సూడాన్ వెళ్లారు. ఇప్పటి వరకు 500 మంది భారతీయులను రక్షించగా మరో 300 మంది వ్యాపారాల కారణంగా అక్కడ ఉండేందుకే మొగ్గు చూపినట్టు సమాచారం.