: 'ఆపరేషన్ సంకట్ మోచన్' సక్సెస్!.. దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయులు క్షేమం!
అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ సక్సెస్ అయ్యింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా రంగంలోకి దిగి రెండు విమానాల్లో రెస్క్యూ సిబ్బందితో కలిసి సూడాన్ వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపిన వీకే సింగ్ చిక్కుబడ్డ 600 మంది భారతీయులను సురక్షితంగా విమానం ఎక్కించారు. తొలుత బయలుదేరిన విమానం సాంకేతిక కారణాలతో ఉగాండాలోని ఎంటెబ్బేలో కొద్దిసేపు ఆగినా ఆ తర్వాత తిరిగి అక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది. ఈ విమానం ఏ క్షణంలో అయినా భారత్ చేరనుంది. ఇక మిగిలిన వారిని కూడా రెండో విమానంలో భారత్ కు తీసుకువచ్చేందుకు అక్కడికి వెళ్లిన రెస్క్యూ టీం చర్యలు చేపట్టింది. మొత్తానికి సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల్లో ఏ ఒక్కరికి కూడా చిన్న అపాయం లేకుండానే వారందరిని సురక్షితంగా దేశానికి చేర్చే విషయంలో కేంద్రం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు.