: బైరెడ్డి శేషశయనారెడ్డి ఇక లేరు!... అనారోగ్యంతో కన్నుమూసిన ‘సీమ’ నేత!
రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి (85) ఇక లేరు. రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) పేరిట ప్రత్యేక పార్టీ పెట్టుకుని రాయలసీమ అభివృద్ది కోసం పనిచేస్తున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి తండ్రిగా ఆయన సీమ ప్రజలకు చిరపరచితులు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన శేషశయనారెడ్డి తొలుత ఎమ్మెల్సీగా రాజకీయ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగానూ ఎన్నికైన ఆయన ఓ దఫా మంత్రిగానూ పనిచేశారు. వయసు మీద పడిన కారణంగా చాలా కాలం క్రితమే రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన తన వారసుడిగా కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని రంగంలోకి దించారు. నిన్న రాత్రి తన సొంతూరు ముచ్చుమర్రిలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. నేడు తమ స్వగ్రామంలోనే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు.