: బీమా సంస్థలను మోసగించిన అమెరికాలోని ఎన్నారై జంటకు రూ.52 కోట్లు జరిమానా
అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ మెడికేర్ తో పాటు ఇతర ప్రైవేట్ బీమా సంస్థలను మోసగించిన కేసులో ఒక ఎన్ఆర్ఐ జంటకు అక్కడి కోర్టు రూ.52 కోట్ల భారీ జరిమానా విధించింది. కీర్తిష్ ఎన్ పటేల్, నీతా కె పటేల్ న్యూజెర్సీలోని బయో సౌండ్ మెడికల్ సర్వీసెస్, హార్ట్ సొల్యూషన్స్ పేరిట మొబైల్ డయాగ్నస్టిక్ కంపెనీని ప్రారంభించారు. న్యూయార్స్, న్యూజెర్సీలోని వైద్యుల సూచనల మేరకు ఆయా ప్రదేశాలకు వెళ్లి అక్కడి రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేేయడం, ఆ నివేదికలను సదరు వైద్యులకు పంపడం చేస్తుండేవారు. అయితే, వైద్యులు సంతకాలు చేసిన రిపోర్టులకు మాత్రమే బయోసౌండ్ మెడికేర్ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. దీనిని అవకాశంగా తీసుకున్న ఎన్ఆర్ఐ జంట వైద్యుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ వందలాది నివేదికలను సృష్టించి తద్వారా సుమారు రూ.30 కోట్లు అక్రమంగా సంపాదించారు. ఈ విషయమై ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎన్ఆర్ఐ జంట మోసం బయటపడింది. 2008 అక్టోబర్ నుంచి 2014 జూన్ మధ్య కాలంలో వీరు తప్పుడు నివేదికలను సృష్టించినట్లు ఆధారాలు దొరకడంతో వారికి భారీ జరిమానా విధిస్తూ న్యాయాధికారులు తీర్పు నిచ్చారు.