: డిగ్గీరాజా ఆస్తి అంతా ఆయన కొడుక్కేనట!... చిల్లిగవ్వ కూడా వద్దన్న రెండో భార్య అమృతా!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. రాజ్యసభ టీవీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అమృతా రాయ్ తో ప్రేమలో పడ్డ ఆయన రెండేళ్ల క్రితం ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే డిగ్గీరాజాకు మొదటి భార్య ద్వారా కలిగిన జయవర్ధన్ సింగ్ అనే కొడుకున్నాడు. ఇక డిగ్గీరాజాకు ఆయన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయ వేత్తగా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుందని ఏ ఒక్కరూ ఆయనను అడగలేదు. అయినా ఆయనే సదరు విషయాన్ని చెప్పేశారు. తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన కుమారుడు జయవర్ధన్ సింగ్ కే చెందుతుందని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని చెప్పిన డిగ్గీరాజా... తన రెండో భార్య అమృతా రాయే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు.