: ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఈడీ కొరడా!... కమోడిటీ మార్కెట్ల కింగ్ జిగ్నేష్ అరెస్ట్!
యావత్తు దేశాన్ని కుదిపేసిన నేషనల్ స్టాక్ ఎక్చేంజీ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న కొరడా ఝుళిపించింది. దాదాపు రూ.5,600 కోట్ల మేర ఇన్వెస్టర్ల సొమ్మును కరిగించేసిన ఈ కేసులో ఎఫ్టీఐఎల్ వ్యవస్ధాపక చైర్మన్, ఆధునిక కమోడిటీ మార్కెట్ల కింగ్ గా పేరుగాంచిన జిగ్నేష్ షాను మొన్న(మంగళవారం) రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోపక్క, గతంలోనే ఈ కేసులో ముంబై పోలీసులు కూడా జిగ్నేష్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ తీసుకుని ఆయన బయటకు వచ్చారు. తాజాగా ఈ కుంభకోణంలో జిగ్నేష్ షా పాత్రకు సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించడం, విచారణకు సహకరించడం లేదన్న కారణాలను సాకుగా చూపుతూ ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిన్న పీఎంఎల్ఏ కోర్టులో ఆయనను హాజరుపరిచిన ఈడీ అధికారులు కోర్టు అనుమతితో ఈ నెల 18 వరకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న విచారణలో జిగ్నేష్ షా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ యత్నించనున్నట్లు సమాచారం.