: చల్లారని కశ్మీరం!... బరితెగింపు ఆపని యువత, 36కు చేరిన మృతుల సంఖ్య!
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో చెలరేగిన హింస జమ్ము కశ్మీర్ లో కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా కొనసాగుతున్న హింసలో చనిపోయిన వారి సంఖ్య 36కు చేరింది. అదే సమయంలో గాయాల కారణంగా ఆసుపత్రి పాలైన వారి సంఖ్య కూడా 2 వేలను దాటిపోయింది. బుర్హాన్ అనుకూలురుగా రోడ్డెక్కుతున్న కశ్మీర్ యువత ఏకంగా పోలీస్ స్టేషన్లపైనే రాళ్లు విసురుతున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. అయితే కశ్మీర్ యువత మాత్రం పోలీసుల తూటాలకు ఏమాత్రం బెదిరిపోవడం లేదు. పోలీసుల బుల్లెట్లకు దీటుగా పోలీస్ స్టేషన్లపైనే రాళ్లు రువ్వుతున్నారు. వెరసి అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.