: ఆకతాయిల్ని ఇరగదీసిన అమ్మాయిలు!
సినిమాల్లో హీరోయన్ ని విలన్ బ్యాచ్ టీజ్ చేసినట్టుగా... నిజజీవితంలో చేద్దామనుకున్న ఆ యువకులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు ముగ్గురమ్మాయిలు. తమను ఏడిపిస్తున్న నలుగురు ఆకతాయి అబ్బాయిలకు స్థానిక మహిళలతో కలిసి ముగ్గురు అమ్మాయిలు చుక్కలు చూపించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని జగ్దాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేద కళాశాలలో రోహన్ హొస్సేన్, సురేష్ భూనియా, దీపక్ సింగ్, బిప్లబ్ దేబ్ విద్యనభ్యసిస్తూ, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరున్న ప్రాంతం మీదుగా వెళ్లాలంటే అక్కడి అమ్మాయిలకు విపరీతమైన భయం. వీరి కామెంట్లు, కాంప్లిమెంట్లు, వెగటు వ్యాఖ్యలు వినలేక ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ముగ్గురు స్నేహితురాళ్లు అటుగా వెళ్తుండగా, ఈ నలుగురు ఆకతాయిలు వారికి అసభ్యకరమైన సైగలు చేయటం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు వారిపై తిరగబడ్డారు. అపర కాళీలై వారిని పట్టుకుని రెండు చెంపలు వాయించే సరికి, యువకులు బెదిరింపులకు దిగారు. దీంతో ఈ తతంగాన్ని చూస్తున్న స్థానిక మహిళలు కూడా వారికి తోడై తుంటరిగాళ్లకు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, వారిపై వేధింపుల కేసు నమోదు చేశారు.