: పక్షుల ప్రదర్శనకు హాజరైన బాలుడిని తన్నుకుపోవడానికి ప్రయత్నించిన భారీ గద్ద!
పక్షుల ప్రదర్శన జరుగుతుండగా, అక్కడికి వెళ్లిన ఓ బాలుడిని తన్నుకుపోయేందుకు ఓ గద్ద ప్రయత్నించింది. ఆ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, అలైస్ స్ప్రింగ్స్ డెజర్ట్ పార్క్ లో 'బర్డ్స్ ఆఫ్ ప్రే' పేరిట ప్రదర్శన ప్రారంభమైంది. ఇక్కడ అతిపెద్ద గద్దలే ప్రధాన ఆకర్షణ. ఓ వైపు పక్షులను తిలకిస్తూనే, మరోవైపు తన షర్టుకు ఉన్న క్యాప్ ను పైకీ కిందకూ ఆడిస్తూ కూర్చున్నాడో ఏడేళ్ల బాలుడు. ఇది గమనించిన ఓ గద్ద ఏకంగా అతనిపైకి లంఘించి, పట్టుకుని గాల్లోకి ఎగిరింది. బాలుడి హాహాకారాలు, అతని తల్లి ఆర్తనాదాల మధ్య దాదాపు 15 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడున్న వారందరి గుండెలూ ఆగేలా చేసింది. చివరికి అంత బరువు మోయలేక వదిలేసి పోయింది. మెల్ బోర్న్ కేంద్రంగా వెలువడుతున్న 'హెరాల్డ్ సన్' కథనం ప్రకారం ఆ బాలుడి పేరు ఆల్బురీ వొడాంగా అని, ముఖంపై గోరు గాట్లు మినహా మరేమీ కాలేదని తెలుస్తోంది. బాలుడిని తన్నుకుపోయిన గద్ద కు 2.5 మీటర్ల వెడల్పయిన రెక్కలు ఉంటాయని, ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఈగిల్ జాతి రకమని తెలిసింది. అతను ఎంతో లక్కీ అని, మరికొన్ని అడుగులు పైకి ఎగిరుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు.