: జగన్ జంగారెడ్డిగూడెం సభలో రైతులు, కార్యకర్తల మధ్య తోపులాట!
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రెండు విభిన్న దృశ్యాలు కనిపించాయి. జగన్ తో తమ గోడు వెళ్లబోసుకునేందుకు పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో ఆయన రాకకు ముందే అక్కడికి తరలివచ్చారు. తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు చూపేందుకు పొగాకు బేళ్లను కూడా అక్కడికి తీసుకొచ్చారు. తమ వెంట తెచ్చిన పొగాకు బేళ్లను రైతులు వరుసగా ఓ పక్కగా వరుసగా పేర్చారు. ఇక జగన్ వచ్చీ రాగానే వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా రైతులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ ప్రసంగిస్తున్న సమయంలో సభా వేదికకు కాస్తంత దూరంగా పొగాకు బేళ్లు పరిచిన చోట స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పొగాకు బేళ్లపై వైసీపీ కార్యకర్తల కాళ్లు పడ్డాయి. పొగాకు బేళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వైసీపీ కార్యకర్తలను తోసేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా రైతులను తోసేసే యత్నం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వైసీపీ కార్యకర్తలకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీనిని గమనించిన వైసీపీ నేతలు కొందరు అక్కడికి పరుగు పరుగున చేరుకుని రైతులు, పార్టీ కార్యకర్తలకు సర్దిచెప్పి ఆందోళనకు చెక్ పెట్టేశారు.