: అవినీతి పార్టీ వైసీపీకి ధర్నా చేసే హక్కు లేదు: ఏపీ మంత్రి దేవినేని ఉమ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కామెంట్లపై స్పందించేందుకు టీడీసీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందరికంటే ముందుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జగన్ కొద్దిసేపటి క్రితం టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఉన్న దేవినేని వేగంగా స్పందించారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు త్వరలోనే కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తాయని చెప్పిన ఆయన జగన్ కామెంట్లపై విరుచుకుపడ్డారు. జగన్ పేరెత్తకుండానే ఆయన తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. అవినీతి పార్టీగా ముద్రపడ్డ వైసీపీకి ధర్నాలు చేసే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఇలాకా పులివెందులకు నీరిచ్చే కాలువలను అడ్డుకుంటూ వైసీపీ అభివృద్ధి నిరోధక పార్టీగా కొత్త అవతారం ఎత్తిందని ఆయన దుయ్యబట్టారు.