: శాంతిస్తున్న గోదారమ్మ, భద్రాచలానికి తప్పిన ముప్పు!
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గడంతో గోదావరి నది శాంతిస్తోంది. నిన్న భద్రాచలం వద్ద 51 అడుగులకు చేరిన నదిలోని వరద ప్రవాహం, నేటి ఉదయం 49.3 అడుగులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో నిన్న వర్షం నమోదు కాకపోవడంతో వరద మరింతగా పెరిగే ప్రమాదం లేనట్టేనని అధికారులు అంటున్నారు. భద్రాచలం మండలంలోని ముంపు గ్రామాలకు ముప్పు తప్పిందని, అయితే, తాలిపేరు ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయికి నీటిమట్టం చేరడంతో ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. ప్రాజెక్టు నుంచి 10 గేట్ల ద్వారా 11,500 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు రాజమండ్రి ధవళేశ్వరం వద్ద నది భీకరంగా ప్రవహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఇంతటి వరదను చూస్తున్నామని చెబుతున్న ప్రజలు, గోదారమ్మ శాంతించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోష్పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ నిండా మునిగిపోగా, సాయిబాబా ఆలయం, గోశాలలోకి నీరు ప్రవేశించింది. ఇక్కడున్న గోవులన్నింటినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కాపలా కాస్తున్నారు.