: తెలంగాణలో బార్లు, వైన్ షాపులపై ఇకపై కఠిన నిబంధనలు
తెలంగాణలోని బార్లు, వైన్ షాపులపై ఇకపై నిబంధనలు కఠినతరం కానున్నాయి. 21 ఏళ్ల లోపు వారికి మద్యం సరఫరా చేసే బార్లు, వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సీఎం కార్యాలయం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈరోజు సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థి తప్పతాగి కారు నడపడంతో చిన్నారి రమ్య మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం సరఫరా, బార్లపై నిఘా కఠినతరం, ప్రతి బార్ లోనూ సీసీ కెమెరా తప్పనిసరి చేయాలనే అంశాలపై వారు చర్చించారు. కాగా, రమ్య ప్రమాదానికి కారణమైన ఇంజనీరింగ్ చదువుతున్న మైనర్ విద్యార్థులకు మద్యం సరఫరా చేసిన బంజారాహిల్స్ లోని టీజీఐ బార్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.