: 30 రూపాయల కోసం యజమానిని హత్య చేసిన ఉద్యోగి
30 రూపాయల కోసం యజమానిని హత్య చేసిన ఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన గణేష్ రఘునాథ్ అనే వ్యక్తి ఔరంగాబాద్ లో మూతబడిన కర్మాగారం వద్ద గంటకు 20 రూపాయల వేతనంతో వాచ్ మన్ గా విధులకు కుదిరాడు. ఈ కర్మాగార యజమాని రామేశ్వర్ శ్రీరామ్ ఒకరోజు జీతం ఇస్తుండగా అదనంగా మరో 30 రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. దీనికి యజమాని అంగీకరించలేదు. దీంతో చేతిలో ఉన్న పారతో యజమాని తలపై గణేష్ గట్టిగా మోదాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. తరువాత నేరుగా ఇంటికి వెళ్లి తల్లి, సోదరులకు విషయం వివరించాడు. దీంతో వారు రహస్యంగా అతనిని ముంబై పంపించారు. ముంబై వెళ్లిన గణేష్ పూటుగా తాగి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తను చేసిన హత్య గురించి పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో పోలీసులు సంఘటనాస్థలికి వెళ్లి చూడగా, కుళ్లిన మృతదేహం కంటబడింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం కోసం అదనంగా డబ్బులు అడిగి ఉంటాడని, ఆయన ఇవ్వకపోవడంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు.