: జకీర్ నాయక్ కు క్లీన్ చిట్!... అరెస్ట్ లేదంటున్న మహారాష్ట్ర ఇంటెలిజెన్స్!
ఇస్లామిక్ మత బోధనలతో ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ఎలాంటి తప్పు చేయలేదట. ఈ మేరకు ‘పీస్ టీవీ’లో ప్రసారమైన ఆయన ప్రసంగాలను పరిశీలించిన మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎస్ఐడీ) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ‘ నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. వేలాది ప్రసంగాల సీడీలను పరిశీలించిన ఎస్ఐడీ అధికారులకు జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలు చేసినట్లు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరలేదని ఆ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చాక కూడా ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశమేదీ లేదని కూడా ఎస్ఐడీ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది. నిన్ననే భారత్ లో అడుగుపెట్టాల్సిన జకీర్ నాయక్ అరెస్ట్ భయంతోనే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు నేటి ఉదయం జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి.