: రూ. 37,600 కోట్లు కట్టండి... భారత ప్రభుత్వానికి కెయిర్న్ ఎనర్జీ డిమాండ్
తమ భారత అనుబంధ సంస్థ రీఆర్గనైజేషన్ విషయంలో రెట్రాస్పెక్టివ్ పన్నుగా రూ. 29,047 కోట్లను డిమాండ్ చేసి, తమ కార్యకలాపాలకు విఘాతం కలిగించినందుకు భారత ప్రభుత్వం 5.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 37,600 కోట్లు) నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఎడిన్ బర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న కెయిర్న్ ఎనర్జీ డిమాండ్ చేసింది. తమను పన్ను చెల్లించాలని కోరడం చట్ట వ్యతిరేకమని చెబుతూ 160 పేజీల 'స్టేట్ మెంట్ ఆఫ్ క్లయిమ్'ను అంతర్జాతీయ మధ్యవర్తి కమిటీ ముందు దాఖలు చేసింది. తక్షణం రెట్రాస్పెక్టివ్ పన్ను చెల్లించాలన్న డిమాండ్ ను వెనక్కు తీసుకోవాలని, యూకే - ఇండియా పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు భారత్ అంగీకరించి, తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. భారత వైఖరి కారణంగా తాము కెయిర్న్ ఇండియాలో 9.8 శాతం వాటాలను కోల్పోయామని, దీనికి పరిహారంగా 1.05 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,050 కోట్లు) చెల్లించాలని కూడా కెయిర్న్ డిమాండ్ చేస్తోంది.