: మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం... బీసీ విద్యార్థులను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న అధికారులు
వైద్య విద్యలో ప్రవేశాల కోసం మెడికల్ కౌన్సెలింగ్ నేడు ప్రారంభమైంది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో అగ్రకులాల వారు ప్రవేశాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు ఓ ముఠా సహకరిస్తోందని నిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బీసీ విద్యార్థులను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ, వారి కుల వివరాలు తెలుసుకుంటున్నారు. వారి నుంచి తమ కులంపై రూ. 100 స్టాంపు పేపర్ పై అఫిడవిట్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వారు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిస్తే, విద్యార్హతలను రద్దు చేయడంతో పాటు, అఫిడవిట్ ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 17 వరకూ కౌన్సెలింగ్ కొనసాగనుంది. నేడు 1 నుంచి 1500 వరకూ ర్యాంకు హోల్డర్లను పిలిచినట్టు తెలిపారు. గత సంవత్సరం విద్యార్థుల కులాలపై కొన్ని ఫిర్యాదులు వస్తే కొందరిని సస్పెండ్ చేశామని, ఈ దఫా అటువంటివి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.