: ప్రత్యర్థి కంపెనీలు దూసుకెళుతుంటే, వెనుకబడుతున్న యాపిల్!


ఇప్పటికే తగ్గిన ఐఫోన్ అమ్మకాలతో దిగాలుగా ఉన్న యాపిల్ సంస్థ, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ అమ్మకాల్లోనూ వెనుకబడింది. 2015తో పోలిస్తే, ఈ ఏడు యాపిల్ కంప్యూటర్ల అమ్మకాలు 8 శాతం వరకూ పడిపోయినట్టు రీసెర్చ్ సంస్థలు తెలిపాయి. అయితే, అమ్మకాల పతనం యాపిల్ కే పరిమితం కావడం గమనార్హం. పోటీలో ఉన్న మిగతా కంపెనీల అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. ఇక తాజా యాపిల్ రిపోర్టులోని వివరాల ప్రకారం, జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి మ్యాక్ అమ్మకాలు 46 లక్షల నుంచి 44 లక్షలకు తగ్గాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ యూనిట్ల విక్రయాలు, 2014తో పోలిస్తే 4.5 శాతం పతనమైనట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ఈ విభాగంలో హెచ్ పీ, డెల్, ఏస్ వంటి కంపెనీలు అమ్మకాలను స్వల్పంగానైనా పెంచుకున్నాయని తెలుస్తోంది. గూగుల్ క్రోమ్ సాఫ్ట్ వేర్ సాయంతో నడిచే కొత్త ల్యాపీలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతోందని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఇక వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో కంప్యూటర్ల అమ్మకాల జోరును సాగించిన యాపిల్ పై ఒకేసారి ఐఫోన్, పీసీల అమ్మకాల తగ్గుదల నమోదు కావడం కొంత ఇబ్బందికర పరిస్థితేనని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News