: కాశ్మీర్ యాత్రికులను నిట్ట నిలువునా దోచుకుంటున్న ఎయిర్ లైన్స్!


జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న హింసాకాండ, ఆ రాష్ట్రంలో ప్రయాణిస్తున్న టూరిస్టులను ఎక్కడికక్కడ నిలిచిపోయేలా చేయగా, అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్న వారిని ఎయిర్ లైన్స్ కంపెనీలు నిట్ట నిలువునా దోచుకుంటున్నాయి. జమ్మూ నుంచి ఢిల్లీకి రావడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేలు వసూలు చేస్తున్నాయి. "అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారుజామున 2 గంటలకు అతి కష్టం మీద విమానాశ్రయానికి చేరుకున్నాం. మధ్యాహ్నం 2:40కి విమానం ఉంది. ఇప్పుడే ఒక్కొక్కరికి రూ. 20 వేలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశాము. ఇప్పుడు ఫుట్ పాత్ పై వేచి చూస్తున్నాం" అని అహానా అనే పర్యాటకురాలు పేర్కొంది. ఒక్క అహానా మాత్రమే కాదు. జమ్మూలో చిక్కుకుపోయి, ఎలాగోలా బయటపడదామని భావిస్తున్న వందలాది మంది పరిస్థితీ ఇదే. శ్రీనగర్ ఎయిర్ పోర్టును రాత్రుళ్లు మూసివేస్తారన్న సంగతి తెలిసిందే. తెల్లారితే ఎయిర్ పోర్టుకు చేరుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో, వందలాది మంది రాత్రి సమయంలోనే ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని రహదారులపై వేచి చూస్తున్నారు. వీరిలో అత్యధికులు తమ పర్యటనను మధ్యలో వాయిదా వేసుకున్నా వారే. "మేము ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఎక్కడికీ వెళ్లే దారికూడా లేదు. మొత్తం 33 మందిమి అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని వచ్చాము. ఇక్కడ చిక్కుకున్నాం. తిరిగి వెనక్కు పోదామంటే మార్గం తెలియడం లేదు" అని లక్ష్మి అనే యాత్రికురాలు వాపోయారు. ఇదిలావుండగా, జమ్మూలోని బేస్ క్యాంపు 1500 మందికి మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలుగుతుంది. ఈ క్యాంపు పూర్తిగా నిండిపోగా, మిగతావారంతా సమీపంలోని దేవాలయాల్లో కాలం గడుపుతున్నట్టు తెలుస్తోంది. పహల్ గాం, బల్తాల్ బేస్ క్యాంపుల్లో అమర్ నాథ్ ప్రాంతాన్ని చేరుకోవడానికి, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చి స్వస్థలాలకు వెళ్లడానికి వేచి చూస్తున్న వారు 25 వేల మందికి పైగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News