: ఎక్కడున్నా దృష్టి అంతా ఇక్కడే!... రష్యా నుంచే గోదావరి ప్రవాహం, పట్టిసీమపై చంద్రబాబు ఆరా!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎక్కుడున్నా... ఆయన దృష్ఠి అంతా రాష్ట్రంపైనే. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ఎక్కడున్నా సమీక్షలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం రష్యా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచే రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. అదే సమయంలో పట్టిసీమకు కూడా వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన అక్కడి నుంచే ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం, పట్టిసీమకు చేరిన నీటి పరిమాణంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం.