: ముగిసిన ఆఫ్రికా దేశాల పర్యటన.. స్వదేశం చేరుకున్న మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన మోదీ చివరిగా కెన్యాను సందర్శించిన అనంతరం భారత్ పయనమయ్యారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగం, భద్రత, ద్వంద్వ పన్నుల విధానం తదితర ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతకుముందు మోదీ టాంజానియా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్ దేశాల్లో పర్యటించారు. టాంజానియాకు రూ.92 మిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే దక్షిణాఫ్రికాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నైయుసితో విస్తృత చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.