: ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులకు రూపాయికే భూమి.. కేజ్రీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన వెంకయ్య
ఢిల్లీలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, నైట్ షెల్టర్లకు తగినంత భూమి ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి రూపాయి నామమాత్రపు చార్జీతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ) భూమిని కేటాయిస్తుందని తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల కోసం భూమి దొరకడం లేదన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రజా ప్రయోజనాలు, సేవల కోసం అతి తక్కువ ధరకే భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. డీడీఏతో సంప్రదింపుల అనంతరం దీనిని అమలు చేస్తామన్నారు. కేంద్రం తమను పనిచేసుకోనివ్వడం లేదన్న కేజ్రీవాల్ ఆరోపణలను వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. ‘‘వారు యాడ్లు ఇస్తున్నారు.. మేం సిటీకి డెవలప్‌మెంట్‌ను యాడ్ చేస్తున్నాం’’ అంటూ తనదైన శైలిలో పేర్కొన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే వైద్య సంస్థలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు తదితర వాటికి ఇకపై ఏడాదికి రూపాయి లీజుతో భూమిని కేటాయించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ కమర్షియల్ మార్కెట్ రేట్ల ప్రకారం చదరపు మీటరు భూమి ధర రూ.1,82,400 నుంచి రూ.6.72 లక్షలు పలుకుతోంది. వీటిని ఇక నుంచి ‘నో ప్రాఫిట్-నో లాస్’ కింద చదరపు మీటరును రూ.11,745కే కేటాయిస్తారు. అలాగే సిబ్బంది క్వార్టర్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, స్థానిక ఆస్పత్రులు తదితర వాటి కోసం కూడా భూమి రేట్లను నివాస స్థలాల ధర కంటే పది శాతం తగ్గించారు. ప్రస్తుతం చదరపు మీటరుకు రూ.31 వేలు- రూ.75,700 ధర ఉంది. వీటిని కూడా ఏడాదికి రూపాయి నామమాత్రపు ధరతో కేటాయించనున్నట్టు వెంకయ్య తెలిపారు. రోడ్లు, శ్మశానాలు, ఆట స్థలాలు, పార్కులు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ తదితర వాటి కోసం భూమిని ఏడాదికి రూపాయి నామమాత్రపు చార్జీతో ఉచితంగా కేటాయిస్తామని వివరించారు.