: ఒంటరితనం విసిగిస్తోంది... మూడో పెళ్లి చేసుకోవాలని ఉంది: మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్ రాజకీయ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి మొట్టమొదటిసారిగా బయటకు చెప్పారు. ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వివాహం, విడాకులు, పిల్లలు, ఒంటరితనం, మూడో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనపైన ప్రస్తావించారు. 'క్రికెట్ జీవితంలో బిజీగా ఉన్నప్పుడు మా వాళ్లు పెళ్లి చేసుకోమన్నారు.. ఒత్తిడి చేశారు. కానీ, నేను చేసుకోలేదు. ఎందుకంటే, ఏదైనా ఒక పని కావాలనుకుంటే నా లక్ష్యమంతా దానిపైనే ఉంటుంది. అందుకే, ప్రాణంగా భావించే క్రికెట్ కే అప్పట్లో అంకితమయ్యాను. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక జెమీనాను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నేను రాజకీయాలపై దృష్టి పెట్టడంతో మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. నేనేమో పాకిస్థాన్ వదిలి వెళ్లలేను .. జెమీనా ఏమో పాక్ లో ఉండలేని పరిస్థితులు. దీంతో, మా ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తడంతో విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే, మా వైవాహిక జీవితానికి తీపి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. మేము విడిపోయినప్పుడు మా పిల్లలిద్దరూ పన్నెండేళ్ల లోపు వారే. తల్లిదండ్రులు విడిపోయారనే దానికంటే వాళ్లు వేరొకరిని పెళ్లి చేసుకున్నారనే భావన పిల్లల్లో కలిగితే ఎక్కువగా కుంగిపోతారని నా మిత్రుడైన మానిసిక వైద్యుడు చెప్పాడు. దీంతో, మొదటి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న పదేళ్ల వరకు రెండో పెళ్లి చేసుకోలేదు. 2015లో రెహమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాను. పదినెలలకే విడిపోయాం. దీంతో, మళ్లీ ఒంటరినైపోయాను. ఎవరి జీవితంలోనైనా విడాకులు తీసుకోవడమనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే, నేను ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్నాను. ఈ అనుభవంతోనే ఆ మాట చెబుతున్నాను. ప్రస్తుతం నేను గడుపుతున్న ఒంటరి జీవితం చాలా విసుగు పుట్టిస్తోంది. అందుకే, మూడో పెళ్లి చేసుకుని, మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ల వయస్సు. నాకు తగిన మహిళ దొరుకుతుందన్న ఆశ అయితే లేదు. కానీ, దేవుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడే తత్వం నాది. రాజకీయ పార్టీ పెట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు నా పార్టీ నిలబడింది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామనే నమ్మకం నాకు ఉంది’ అని ఇమ్రాన్ ఖాన్ తన మనసులో మాటలను చెప్పాడు.

  • Loading...

More Telugu News