: ఒవైసీ సోదరులతో అమిత్ షా రహస్య ఒప్పందం చేసుకున్నారు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఓజా
భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేయడానికి ఆయనకి మరో అస్త్రాన్ని అందించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే యతిన్ ఎన్.ఓజా. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల బరిలో దిగడానికి ఓజా యోచిస్తోన్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీపై ఈ ఆరోపణలు చేస్తూ ఆయన పలు జాతీయ పత్రికల్లో నిలిచారు. కొన్ని నెలల క్రితం జరిగిన బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీల మధ్య ఓ డీల్ జరిగిందని, దాని ప్రకారమే బీజేపీ బీహార్ ఎన్నికల్లో దిగాలనుకుందని ఓజా చెప్పారు. ఆ రాష్ట్రంలో అధికంగా ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దింపేలా, అలాగే ప్రసంగాలతో రెచ్చగొట్టేలా ఇరు పార్టీల నేతలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన కేజ్రీవాల్‌కు ఓ లేఖ ద్వారా తెలిపారు.