: భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి... నిండిన అన్ని ప్రాజెక్టులు!
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి చేరుతుండటం, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగుతుండటంతో, భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఈ మధ్యాహ్నం 43 అడుగుల నీటి మట్టం నమోదైంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో 29 అడుగుల వద్ద ఉన్న నీరు ప్రస్తుతం మరో 14 అడుగులు పెరిగింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో స్నానాలు చేసేందుకు శ్రీరామ భక్తులను అనుమతించడం లేదు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరిపై ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండిపోగా, పలు గ్రామాల ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.