: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయిన ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు!
కేరళ నుంచి మాయమైన వారిలో గర్భవతిగా ఉన్న 24 ఏళ్ల యువతి ఇప్పటికే సిరియాకు చేరిపోయి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరినట్టు తెలుస్తోంది. ఆ యువతి తల్లి బిందు కుమార్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కలిసి మాయమైన తన బిడ్డ ఆచూకీ కనుక్కోవడంలో సహాయం చేయాలని అర్థించింది. వ్యాపారం నిమిత్తం శ్రీలంకకు వెళుతున్నట్టుగానే తన బిడ్డ చెప్పిందని పేర్కొంది. బిందు కుమారుడు ప్రస్తుతం ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోగా పనిచేస్తున్నారు. ఎంతో తెలివైన తన కుమార్తె ఓ క్రిస్టియన్ ను వివాహం చేసుకుందని, ఆపై వారిద్దరూ ముస్లిం మతం స్వీకరించారని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని ఆమె వాపోయింది. ఆపై తనకు బురఖా వేసుకుని కూతురు కనిపించగా షాక్ తిన్నానని తెలిపింది. గత నెల 5న శ్రీలంక వెళుతున్నట్టు చెప్పిందని, ఆపై చాలా రోజుల పాటు సమాచారం లేదని తెలిపింది. ఆపై ఎక్కడి నుంచి మాట్లాడుతున్నదీ వెల్లడించకుండా, వాట్స్ యాప్ ద్వారా ఒక్కసారి ఫోన్ చేసిందని తెలిపింది. కాగా, మరోవైపు బిందు అల్లుడి తల్లిదండ్రులు సైతం తమ బిడ్డ కనిపించడం లేదని, ప్రభుత్వం అతన్ని వెతికిపెట్టాలని కోరుతోంది. కాగా, ఈ జంట ఇప్పటికే సిరియా వెళ్లిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు.