: ‘మండలాధీశుడు’ తర్వాత ఒక గ్రూప్ ఏడాదిపాటు నాకు అవకాశాలివ్వలేదు: కోట శ్రీనివాసరావు
గతంలో తాను నటించిన ‘మండలాధీశుడు’ చిత్రం తర్వాత ఒక గ్రూప్ తనకు ఏడాదిపాటు అవకాశాలివ్వలేదని విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. అయితే, హీరో కృష్ణతో పది నుంచి పదిహేను సినిమాల్లో అప్పుడు తాను నటిస్తున్నానని, దీంతో తానేమీ పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పారు. ‘ఆ చిత్రంలో ఎన్టీరామారావుగారిని తానెక్కడా తిట్టలేదు... రామారావుగారు తిడితే ఎలా ఉంటుందనేది ఆ చిత్రంలో ఉంది. మహానుభావుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి... ఆయన గురించి సినిమా తీస్తే, ఆయన పిల్లలకు, వాళ్ల వాళ్లకు కోపం రావడం సహజం. ఒకసారి, ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ గారు కనపడితే వెళ్లాను.. ఆయన మాట్లాడారు. నా భుజం తట్టి 'మంచి భవిష్యత్ ఉన్న నటులు మీరు' అన్నారు. నేను ఆయన కాళ్లకు దండం పెట్టి వచ్చేశాను’ అని కోట శ్రీనివాసరావు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.