: రూ. 251కే స్మార్ట్ ఫోన్ అందుకున్న యువతి స్పందనిది!
రూ. 251కే అన్ని సదుపాయాలున్న స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ సీఈఓ మోహిత్ గోయల్ ప్రకటించిన వేళ, టెక్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అంత తక్కవ ధరకు ఫోన్ ఇవ్వడం అసాధ్యమని, కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్ కు అమిత ఆదరణ రాగా, గంటల వ్యవధిలో 7 కోట్ల బుకింగ్స్ వచ్చాయి కూడా. అంత తక్కువ ధరకు ఫోన్ల తయారీ సాధ్యమని చెప్పిన రింగింగ్ బెల్స్ పై పలు రకాల విచారణ జరిగింది. ఇక అడ్డంకులన్నీ పూర్తయి ఈ ఫోన్ల డెలివరీ 8వ తేదీన ప్రారంభం కాగా, రిజిస్ట్రేషన్ చేసుకుని పోన్ అందుకున్న వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. "ఫోన్ ను డెలివరీ చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఇదో మోసపు సంస్థని భావించాను. సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న జోకులు చూసి 'చూద్దాంలే' అని రిజిస్టర్ చేసుకున్నాను. నాకు ఫోన్ వచ్చింది" అని నోయిడాకు చెందిన 27 ఏళ్ల అంకితా బిర్లా వ్యాఖ్యానించారు. కాగా, మొత్తం 2 లక్షల ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు మోహిత్ ఇప్పటికే వెల్లడించారు.