: కల్లోల కాశ్మీరం... కొనసాగుతున్న అల్లర్లు, 15కు పెరిగిన మృతులు
ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ అనంతరం జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. దాదాపు 200 మందికి పైగా అల్లర్లలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసు స్టేషన్లు, మైనారిటీ క్యాంపులు లక్ష్యంగా అల్లరిమూక దాడులు చేస్తోందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఎం సహాయ్ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉందని, తాజా హింసాత్మక ఘటనల్లో 90 మందికి పైగా గాయపడ్డారని, వీరిలో భద్రతా దళాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, ఈ ఘటనల్లో అమాయకులు మరణించడం తనను కలచి వేసిందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర బలగాలకు చెందిన 1200 మందిని మోహరించినట్టు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కోరారు. కాశ్మీరు లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేశారు.