: చంద్రబాబుకి భూమిపిచ్చి పట్టుకుంది... ఏమిటీ ధన దాహం?: సీపీఐ రామకృష్ణ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భూమిపిచ్చి పట్టుకుందని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బందరులో ఆయన మాట్లాడుతూ, గతంలో బందరు పోర్టు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆరు వేల ఎకరాలు సేకరిస్తామని చెబితే... ఇప్పుడు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు అప్పట్లో బందరు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పర్యటించి, పోర్టుకి 2 వేల ఎకరాలు సరిపోతాయని, అలాంటప్పుడు 6 వేల ఎకరాలు ఎందుకని అన్నారని... ఇప్పుడు వారు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే రాజశేఖరరెడ్డి 6 వేల ఎకరాలని చెబుతున్నాడని అప్పట్లో టీడీపీ నేతలు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టుకి లక్ష ఎకరాల భూములు కావాలని అంటున్నారని, ప్రతిపక్షంలో ఉండగా 2 వేల ఎకరాలు సరిపోతాయని చెప్పిన టీడీపీ నేతలకు అధికారంలోకి రాగానే లక్ష ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. ఇందుకోసం 20కి పైగా గ్రామాలను ఖాళీ చేయిస్తామని అంటున్నారని, ఇంత మంది ప్రజల ఆస్తులను లాక్కుని చంద్రబాబు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకి భూమిపిచ్చి పట్టిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎందుకంత డబ్బు సంపాదన దాహమని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News