: చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్... కడప సెంట్రల్ జైలుకు తరలింపు
వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారంటూ చిత్తూరు జిల్లాలోని వడమాలపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయన అరెస్టయ్యారు. కోర్టు రిమాండ్ తో సబ్ జైలుకు వెళ్లిన ఆయన బెయిల్ తీసుకుని నేటి ఉదయం బయటకు వచ్చారు. అయితే అప్పటికే ఆయన కోసం అక్కడ కాపు కాసిన ఎంఆర్ పల్లి పోలీసులు అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న కేసులో ఆయనను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించే క్రమంలో చిత్తూరు ఖాకీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిధిలోని జైళ్లలో అయితే చెవిరెడ్డికి అభిమానులు పోటెత్తుతారని భావించి పొరుగునే ఉన్న కడపలోని సెంట్రల్ జైలుకు తరలించారు. వెరసి చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో అరెస్టైన చెవిరెడ్డి మరికాసేపట్లో కడప సెంట్రల్ జైలులో అడుగుపెట్టనున్నారు.